శ్రీకైవల్యము

పోతన భాగవతాన్ని “శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతిచెదన్” అని ప్రారంభించేడు. ప్రారంభిస్తూనే భాగవతం వ్రాయటంలొ తన అభీష్టాన్ని ఉద్ఘాటించేడు పోతన, కైవల్యాన్ని చేరు కోవటమే తన ఉద్దేశ్యము. ఎన్నెన్నో జన్మల సత్కర్మ ఫలమే మానవజన్మ. మానవజన్మ తోనే ఎవరైనా జన్మ రాహిత్యం పొంది పరమ్మత్మ లో ఐక్యమయే అవకాశం ఉంది, ఇదే కైవల్యాన్ని చేరుకోవటం. ఆటువంటి ఉత్కృష్టమైన మానవజన్మ కర్మ రాహిత్యం చేసుకుందుకి ఉపయోగించాలి. అయితే ఈ శ్రీకైవల్యం అంటే ఏమిటి. కైవల్యం అంటే నే గొప్పది పరమోత్కృష్టమైనది. దానికి శ్రీ అని పూర్వపద విశేషణం అవసరంలేదు. మరి ఈ శ్రీ అనే అక్షరం ఎందుకు.

సాధారణంగా, ఏదైన పద్యకావ్యం ప్రారంభం శ్రీకారంతో మొదలవుతుంది ఎందుకంటే చందస్సు శ్రీచక్ర సౌస్ఠవగుణం నుంచి పుట్టింది కాబట్టి, కవులందరు చందోబధ్ధకావ్యాలని వ్రాసినప్పుడు శ్రీకారం తొ మొదలెడతారు. కేవలం అంత చిన్న కారణం కోసం శ్రీకైవల్యం అని వ్రాసి కైవల్యాన్ని మరింత గొప్ప కైవల్యం అని వ్రాయనవసరం లేదు.

ఇక్కడ మనం మరింత గా పోతన స్థాయి లొ ఆలోచించాలి. ఎవరనా అడవులలోనికి వెళ్ళి తపస్సు చేస్తే, కుండలిని యోగం వలన కర్మ హరణమై కైవల్య ప్రాప్తికి అవకాశం ఉంది. కాని మానవజన్మ ఎత్తిన అందరూ తపస్సులో ములిగి పోతే కొంత కాలనికి మానవులందరూ అంతరించిపోతారు. ఇది అందరికి అనుసరణీయం కాదు. కాని పరమోత్కృష్టమై మానవ జన్మ ఎత్తి తిరిగి సంసారబంధంలో ములిగి కర్మ చక్రంలొ నలిగిపోవలిసిందేనా, దీనికి సమాధానమే ఈ శ్రీకైవల్యం, ఇక్కడ శ్రీ కైవల్యానికి విశేషణం కాదు, అసలు శ్రీ కైవల్యము అనే వి రెండు వేరు వేరు పదాలు. ఇక్కడ శ్రీ అనే అక్షరం ఇహాన్ని సూచిస్తుంది. ఇహ లోకం లో వైభవంగా బతికి ధర్మ కార్యాలు చేస్తూ ధర్మ బద్ధం గా బ్రతుకుతూ కైవల్యాన్ని చేరుకొనే మార్గమే భాగవతం. తనే కాదు భాగవతం చదివిన ప్రతీ వారికి జన్మ జన్మ ల కర్మ బంధం నుంచి విముక్తి కలిగి పరమాత్మ లో లీనమవుతారు. అందుకే పలికిన భవహరమగునట అని చెప్పేడు.

ఇక్కడ శ్రీ అనే అక్షరం ఒక అక్షర మే కాదు, ఒక పదం. ఒక పదమే కాదు, పరిపూర్ణ వాక్యం, పరిపూర్ణ వాక్యమే కాదు మానవజీవితానికి పరమార్ధాన్ని బోధించే సంపూర్ణ కావ్యం.

పోతన తెలుగు వాడిగా జన్మించడం తెలుగు వారు చేసుకున్న అదృష్ఠం. భాగవతాన్ని చదువుదాం. జన్మ రాహిత్యాన్ని పొందుదాం.

కాకరమురళీధర్. – కాముధ

Leave a comment