అపజయాన్ని నేను

May 20, 2018

అపజయాన్ని నేను
అవహేళనని, అవమానాన్ని నాతో తీసుకొస్తాను
అధైర్యం, నిస్సహాయత నా వెన్నoటే ఉంటాయి
నిరాశ, నిశ్పృహ నాతొ తొడుగా వస్తాయి.

అపజయాన్ని నేను
అందరూ నేంటే భయపడతారు
అందరూ నానుంచి దూరంగా ఉండాలనుకొంటారు
అందరూ నన్ను చూసి అసహ్యించుకుంటారు

అపజయాన్ని నేను
నాతో ఆడుకొనేవారికి
వారికి తెలియని నిద్రాణమైన శక్తులను వెలికి తీసి
కొత్త ఊపిరి నింపి, వారినే వారికి కొత్తగా పరిచియం చేసి
గెలుపు విలువను తెలియజెప్పి
విజయం వాకిట్లో సగర్వoగా నిలబెడతాను.

అపజయాన్ని నేను

కాముధ – కాకర మురళీధర్

Advertisements

బండన భీముడు

April 26, 2018

భండనభీముఁ డార్తజనబాంధవుఁ డుజ్జ్వలబాణతూణ కో
దండకలాప్రచండ భుజతాండవకీర్తికి రామమూర్తికిన్
రెండవసాటిదైవమిఁక లేఁడనుచున్‌ గడగట్టి భేరికా
డాండ డడాండడాండ నినదంబు లజాండము నిండ మత్తవే
దండము నెక్కిచాటెదను దాశరథీ! కరుణాపయోనిధీ!
ఈ పద్యం రామదాసు గా ప్రసిధ్ధి చెందియన కంచెర్ల గొపన్న రాసిన దాశరధీ శతకం లోనిది.

అర్ధం:- యుద్ధం చెయ్యడం లో ప్రసిద్ధి గాంచిన వాడు, భక్తజన భాందవుడు, కోదండం తొ ఉజ్వల భాణతూణీరాలు వేయ గల భుజ బలసంపదగల రాముడి ని మించిన వేరే దేవుడు లేడని ఢం ఢఢం ఢం ఢం ఆని ఢంకా భజాయించి భుమండలమంతా వినబడేలా మదించిన ఏనుగు మీదకెక్కి చాటుతాను అని అర్ధం.
ఈ పద్యం ఉత్పలమాల అయినప్పటికీ 5 పాదాలుండటం వలన ఉత్పలమాలిక అయింది. దాశరధీ శతకం లో ఇలాంటి ఐదేసి పాదాలు పద్యాలు ఇంకా 5 ఉన్నాయి. ఈ పద్యం లో రాముడి లాంటి రెండొ దెవుడు లేడు అంటే అంటే శివుడో, వినాయకుడొకాదు. అది తెలుసుకోవాలంటే ఆనాటి సామాజిక రాజకీయ పరిస్తితులు తెలుసుకోవాలి.

మహామ్మదీయులు భారతదేశం లొ ప్రవేశించి వేల దేవాలయాలు నాశనం చేసారు. విగ్రహాలను ధ్వంస్వం చేసి అపవిత్రం చేసి పనికి రాకుండా చేసారు. చివరకి శ్రీరంగం లోని విగ్రహాన్ని కాపాడుకోవడం కోసం తిరుపతికి తీసుకొని వెళ్ళారు. 7000 వేల ఏళ్ళ చరిత్ర గల శ్రీకూర్మం కోవెలను కాపాడడం కొసం దాని మీద మట్టి దిబ్బలుపోసి 200 ఏళ్ళు ఉంచేశారు. ఇవి కొన్ని మాత్రమే, పూర్తిగా ధ్వంస్వం అయిపొయిన ఆలయాలు మరెన్నో.

సనాతన ధర్మానికి మూలాలు దెవాలయాలు. మన సనాతన ధర్మం వేల ఏళ్ళగా నిత్యనూతనం గా నిలబడటాని కారణం, వేదాలు వెద విద్య నశించకుండా ఉండటానికి కారణం దేవాలయాలు. అటువంటి దేవాలయల మీద మన సంస్కృతి మీద దాడిజరిగింది. దక్షిణాదిన శ్రీకృష్ణ దేవరాయలు తరువాత పెద్ద ఆలయాలు కట్టించె రాజులు కరువైనారు. ఉన్నవాళ్ళు వారి రాజ్యం కాపాడుకొవడం కోసం మహమ్మదీయులకి వశమై పోవడమో లేక వారి చేతులో ఓడిపొవడమో జరిగేది. హిందువులమీద జరగరాని అక్రుత్యాలన్ని జరిగేవి. బెదిరించి, బలవంతంగా మతమార్పుడులు బహిరంగంగా జరిగేవి.

మరోపకా ఈస్టిండియా కంపెని కాలూనుతున్న రొజులు. సామ దాన ఉపాయలతొ కిరస్తాన మత మార్పిళ్ళు జరుగుతుండేవి.

ఆటువంటి కాలం లో మన సనాతన ధర్మన్ని నిలబెట్టడానికి నైజాం కాలం లొ గొపన్న కట్టించిన ఆలయం భద్రాచల రామాలయం. దీనికిగాను ఆయనకి కారాగార శిక్ష వేసారు. చియవరకు రాముడే దిగివచ్చి అయనను విడిపించాడు. ఆయన రాసిన కీర్తనలు అమృత తుల్యాలు. తరతరాలుగా పాడుతునే ఉన్నారు.

సాహితీ రాజ్యానికి రాజు, సంగీత రాజ్యానికి రారాజు, భక్తి సామ్రాజ్యానికి చక్రవర్తి, విపత్క పరిస్తితులలొ సనాతన భారతీయ ధర్మాని నిలబెట్టిన మరో మహా మనీషి కంచెర్ల గొపరాజు.

కాముధ – కాకర మురళీధర్

మేడ మీద లైబ్రరి.

April 18, 2018

1985 లొ నేను ఇంటర్, ఎమ్సెట్ పరీక్షలు మే 15 న ఐపోయిన తరువాత గీతమ్ ఇంజినీరింగ్ లొ తిరిగి క్లాసులు సెప్టెంబెర్ లో మొదలు పెట్టే వరకు కనీసం ముడునెలలో చాలాకాలం విజయనగరం అయ్యకోనేరు గట్టు మీద ఉన్న మేడమీద లైబ్రరిలో గడిపేను. ఆ లైబ్రరియన్ మానాన్నగారికి తెలిసిన వాళ్లవడం చెత డబ్బులు కట్టకుండానె ఇంటికి కూడా పుస్తకాలు ఇచ్చేవారు. ఉదంయ 7 నుంచి10 వరకు , సాయంత్రం 4 నుంచి 7 వరకు లైబ్రరి టైమింగ్స్. ఉదయం ఒక పుస్తకం చదివి మధ్యాహ్నం ఇంటికి ఒక పుస్తకం పట్టుకొని వెళ్ళి చదివెసి, సాయంత్రం తిరిగి మరలా ఒక పుస్తకం చదివి రాత్రికి ఇంటికి మరల ఒక పుస్తకం తెచ్చుకొని చదివే వాడిని. ఇలా చాలా పుస్తకాలు చదివాను. మచ్చుకి కొన్ని

మొక్కపాటి వారి బారిస్టరు పార్వతీశం మూడు భాగాలు,
రావూరి భరద్వాజ పాకుడు రాళ్ళు, కాదంబరి, ఒకరాత్రి ఒక పగలు., ఇంకా చాలా
వడ్దెర చండీదాస్ నాలుగువందల పైచిలుకు పాత్రల తొకూడిన “హిమజ్వాల”, ఐదుగురి పరిచయం లేని మనుషుల సమాంతర జీవితాలతో కూడి, సమకాలీన రాజకీయాలు చర్చిస్తూ సాగె “అనుక్షణికం”
నవీన్ నిత్యచైతన్య స్రవంతి (జేమ్స్ జాయిస్ “ఫెన్నిగన్స్ లేక్” తరహాలో) పద్దతి లో సాగే “యూనివర్సిటి”. సామాన్య మానవజీవితం లో ఉండే మెలొ డ్రామాని అతి సామాన్యంగా వర్ణించే “ఇసుక బొమ్మలు”
బుచ్చి బాబు చివరకు మిగిలేది, కధల సంపుటి
గురజాడ వారి కన్యాశుల్కం, పుత్తడిబొమ్మ, ముత్యాల సరాలు,
కాళ్లకూరి వారి వరకట్నం.
శ్రీశ్రీ మహాప్రస్తానం, ఖడ్గసృష్టి
ముప్పాళ రంగనాయకమ్మ జానకి విముక్తి మూడు భాగలు, స్వీట్ హోం, బలిపీఠం, కూలిన గోడలు, పేకమేడలు, రచయత్రి, క్రిష్ణవేణి, రామాయణ విష వృక్షం.
అడవి బాపిరాజు – కోణంగి, నారాయణ రావు, గోనగన్నారెడ్డి, హిమబిందు.
నండూరి రామ్మోహన రావు ఖగొళ శాస్త్రం గురించి అ ఆ ల దగ్గరనుంచి అం అః ల వరకు చెప్పే విశ్వరూపం, ఇంకా ప్రఖ్యాత ఇంగ్లిషు రచనలకి వారి తెలుగు అనువాదాలు, “మార్క్ ట్వేన్ రచనలుకి ఆయన రాసిన అనువాదాలు, “Arround the world in 80 days” “Tressure Island” కి ఇంకా మరెన్నో

ఆరోజుల్లో కన్నెపిల్లలని కలల భవిష్యత్తులో ఊహలూగించన యుధ్ధనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన కోడురి కౌసల్యాదేవిల నవలలు.
ఇంకా గుర్తులేని మరెన్నో……. చదివాను.

రంగనాయకమ్మ రచనలు నామీద కోలుకోలెని దెబ్బ తీసాయి. పదేళ్ళ పాటు నేను నాస్తికుడిగా మరిపొయాను. 1995 లొ మా తాతగారు CDR హాస్పటలో ఉన్నప్పుడు జరిపిన సంభాషణలు, ఆయన అడిగిన ప్రశ్నలకి నేను జవాబులు వెతుక్కోనే ప్రయత్నంలొ నా అలోచనా సరళి మారి, నన్ను నేను తెలుసుకొని ( నాకు అంతాతెలుసని అనుకుంటున్నాని, నిజాని నాకేమి తెలియదని, నాకేమి తెలియదని కూడా నాకు తెలియదని తెలుసుకొని, తెలియడం, తెలుసుకోవడం, తెలియకపొవడం అంతా మిధ్య అని తెలుసు కొని) జన జీవన స్రవంతి లో కలిసిపోయాను.
కాముధ ఉరఫ్ కాకర మురళీధర్

పొడవు పొడవున కురచై

April 11, 2018

పొడవు పొడవున కురచై

వామన చరిత్ర లోని శుక్ర బలి సంవాదంలొని సంధర్భం లో బలి శుక్రునితో అన్నది. ఎలాంటి పొడవు కురచైనాడు,

“ఉడుగని క్రతువులఁ వ్రతములఁ బొడగనఁ జన నట్టి పొడవు”,

ఎడతెగని యఙ్ఞాలు, యాగాలు, వ్రతాలు చేసినా దర్శనం కలగనటువంటి పొడవు(గొప్పవాడు),

పొడవున కురచై, అంటే పొట్టి వాడైన వ్యక్తిగా, ఇంకా దానం అడుగుతూ ఔన్నత్యంలో తక్కువవాడిగా శ్లేషార్ధం ఉపయోగిస్తూ పోతనగారు చెప్పారు. పూర్తి పద్యం ఇదీ…

ఉడుగని క్రతువులఁ వ్రతములఁ
బొడగనఁ జన నట్టి పొడవు పొడవునఁ గుఱుచై
యడిగెడినఁట; ననుబోఁటికి
నిడరాదె మహానుభావ! యిష్టార్థంబుల్.

ఆ పొడుగు ఎంత గొప్పవాడొ తరువాత పద్యంలో చెప్తారు. ఆదిన్ శ్రీసతి కొప్పుపై అంటూ..

ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ, దనువుపై, నంసోత్తరీయంబుపై,
బాదాబ్జంబులపైఁ, గపోలతటిపైఁ, బాలిండ్లపై నూత్నమ
ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీఁదై నా కరంబుంట మేల్
గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?

ఈ వర్ణన గురించి చాలా మంది పరి పరి విధాలగా చెప్పారు. ఆ అంగాల వరుస ఎందుకు 
వస్తుందో కరుణశ్రీ తొ సహా చాల మంది చెప్పారు. ఇక్కడ నాకు కొంచం  ఔచిత్యం 
లోపించినట్లు అనిపించింది. విష్ణువు ఎంతగొప్పవాడొ చెప్పడానికి లక్ష్మీదేవి అంగాలపై 
ఉన్న చేయి అని చెప్పక్కర్లేదు, తమ వంశస్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి వచ్చిన 
నరసింహుని చేయి అనిచెప్పవచ్చు, సుదర్శనం ప్రయోగించి గజేంద్రుని రక్షించిన చేయి 
అనిచెప్పవచ్చు. సర్వవ్యాపకుని, సర్వ సమర్ధుడిని, అవధువులులేని దయాళుని 
వర్ణించడాని వేరే ఉపమానాలే దొరకలేదా, పోతన ఇలా ఎందుకు రాస్తాడు.

వచ్చిన వాడు విష్ణువు అని బలికి తెలుసు, మన ఇంటికి దేవుడువస్తే ఏం చేస్తాం. పూజ. జాగ్రత్తగా గమనించండి. ఆదిన్ అంటే ఓం, శ్రీ అంటే శ్రీం, సతీ అంటే హ్రాం హ్రుదయాయనమః, కోప్పుపై అంటే హౄం శిఖాయైవషట్, తనువుపై  హ్రైం కవచాయహుం అంటూ అంగన్యాస కరన్యాసాలతో బీజాక్షర సహితంగా ప్ర్రాణప్రతిష్టాపన గావించారు. నూత్న మరయాదలు అంటే షోడసోపచారములు గావించి, రాజ్యము గీజ్యము సతతమే అంటూ శుక్రుడు అతకు ముందు అన్న దానము గీనము వద్దు అన్న దానికి సరైన బదులిస్తూనే రాజ్యము, సతతము అంటూ రాజాదిరాజయ ప్రసంవ్యసాహినే.. అంటూ మంత్ర పుష్పముచెప్పి, కాయంబు నాపాయమే  అంటూ సశరీరంగా ఆత్మ ప్రదక్షణ గావించి పూర్తి పూజ గావించి అంతకుముందు చెప్పిన ఉడుగని క్రతువు అన్నదానిని సార్ధకం చేశాడు.

మొత్తం పూజ ఇంత తక్కువలోనా అంటే పొడుగున కురచై ముందే చెప్పాడుకదా. పోతన పద్యాలు మంత్రాక్షర నిబీడితాలై పూర్తిగా పూజలలో ఉపయోగించడానికి అనువైనవి. పోతన పద్యాలని పూర్తిగా అర్ధం చేసుకొవడానికి ఒక జన్మ చాలదు. పలికిన భవహరమగునట అని చెప్పిన పద్యాలు. కొన్ని పద్యాలు చడివినా మరొక జన్మ మరుండదు. స్వయంగా రామచంద్రమూర్తి చేయి పట్టుకొని రాయించిన పద్యాలు నిగమ సమములై భాసిల్లుతున్నాయి. పోతన తెలుగువాడవటం మనందరి అదృష్టం.

 

పోతన భాగవతం- 1

May 27, 2017

వారిజనలోచన(బాడుచు
వారిజలోచనలు వారి వారికి వేడ్కన్
వారి విహారము సలిపిరి
వారి విహారములు జగతి వారికి( కలవె?

ఈ పద్యం పోతన భాగవతం లోని గోపికా వస్త్రాపహరణంలొ మొదటి పద్యం. శ్రీక్రిష్ణుని స్తుతిస్తూ గోపికలందరూ నీటిలో జలకాలటలాడుతున్నారని. వారంతా హాయిగా ప్రపంచంలో మరెవరు ఆడలేరని దీని అర్ధం. ఇంతచప్పగా పోతన ఎందుకు రాస్తాడు.

మరోకసారి పరిశీలిద్దాం. ఇందులో యమకాలంకారం, (వారిజలోచనన్, వారిజలొచనులు, ఒకేపదాన్ని రెండు సార్లు అర్దభేదం తొ ప్రయొగించడం), చేకానుప్రాస( వారి అనే పదాన్ని 7 సార్లు ప్రయొగించడం) అనే శబ్ధాలంకారాలు ఉన్నాయి. యువతు లు వివస్త్రగా స్నానం చేస్తున్నారు వారికి అలంకారం గా శబ్ధాలంకారాలు ఉపయొగించి అలంకరణ చేసాడు. ఇది బాగుంది కాని ఇంకా ఈ పద్యం పొతన స్తాయిని అందుకోలేదు.

మరొకసారి పరిశీలిద్దాం. యువతులు వివస్త్రలుగా స్నానం చేస్తున్నారు, మన మనసులు ఎక్కడుంటాయో పోతనకి ఖచ్చితంగా తెలుసు. అందుకే పద్యాన్ని వారిజలోచనుడు విష్ణుమూర్తి తొ మొదలు పెట్టేడు వాతరువాత వారిజలొచనులు అంటూ లక్ష్మీ దెవిని స్మరించి మన మనసుకి భక్తి అనే భావన కల్పించి అన్య భావనలనుంచి దూరం చేసేడు. ఐతే విష్ణు మూర్తి లక్ష్మి దేవిలను స్మరించడానికి ఒకే మాదిరి పదాలను ఎందుకు ఉపయొగించాలి, కేవలం యమకాలంకారాన్ని పండించి తన పాండిత్యాన్ని మనకు ప్రదర్శించడానికి మాత్రం కాదు, తల్లి తండ్రి ఒకే అక్షరం తొ మొదలౌతారనే నిజాన్ని మనకు తెలియచెప్పి మనమనస్సుని భగవధ్యానం వైపు మళ్లించడానికి.

వారి అనే పదాన్ని అన్ని సార్లు ఎందుకు వాడేడు. పోతన మహా భక్తుడు, పండితుడే కాదు, మహా తత్వవేత్త. నాలుగు వేదాలని క్షుణ్ణంగా చదివినవాడు. వారి అంటే నీరు, వారి అంటే స్త్రీ కూడా, జగతి అంటే పంచభూతలల్తొ ఆవరంచిబడిన ప్రపంచం. వారి అనే పదం అనెక సార్లు వాడి పంచభూతలలో ఒకటైన నీటిని స్త్రీతత్వం గా ప్రతిపపాదిస్తున్నాడు. జగతి వారి అనేపదం ఉపయోగించి పంచభూతాలో నీటిని జగన్మాతగా నిరూపిస్తున్నాడు. మనం ఎక్కడ తెలుసు కో కుండా మరిచి పోతామో అని ప్రశ్నార్ధకం లో ముగించి అర్ధాన్ని అర్ధం చేసుకొనేవరకు చదువు కొమ్మని చెప్పాడు.

పంచభూతలింగాలలో జలలింగం గా ప్రసిద్ధి చెందిన జంబుకేస్వరం లో రోజూ మధ్యాహ్నంసరిగ్గా 12 గంటలకి పురొహితులు స్త్రీ వెషధారణలో అభిషేకం చెస్తారు.

” ఓం!! యో అపా పుష్పమ్ వేదా! పుష్పవాన్ ప్రజవాన్ పశుమాన్ భవతి!!.

కాముధ – కాకర మురళీధర్

అవినీతి సమాజ ప్రక్షాళన

November 20, 2016

మన ప్రస్తుత సమాజం లొ మాటకోసం కోటను వదులుకోనే రాముడి స్థాయి నుంచి, నోటుకోసం మాట మార్చే స్తాయి కి దిగజారిపోయింది.

తప్పు చేయడం తప్పు అనే స్థాయినుంచి, తప్పుచేయడం తప్పుకాదనే స్తితికి దిగజారి, ఇంకా కిందకి, తప్పు చేయడమే ఒప్పు అనే అనాగరిక వ్యవస్త గామారీ, తప్పు చేయనివాడు తెలివి హీనుడిగా పరిగణించే దుస్తితికి వచ్చాము. నిజం చెప్పడం నేరంగాను, అపద్ధం చెప్పడం అధికారం గాను భావిస్తున్నాం

యధా రాజ తధా ప్రజా!!. అవినీతి, అధర్మం మీద స్త్తాయిలొ మొదలై, మధ్యా స్త్తాయికి ప్రాకి, కింద స్తాయి వరకు వ్యాపించి కూకటి వేళ్ళలొ పాతుకు పోయింది. ఈ పద్ధతి మరింత గా కొనసాగితే సామాన్య మనవుడు బ్రతుకలేడు. ఎవరి వృత్తి వాళ్లు చేసుకొని ఆ సంపాదనతో బ్రతకలేం. బలం అధికారం ఉన్నవాడిదే రాజ్యం అయి ,నడిరోడ్డు మీద దోపిడీలు, ఇంటికి వచ్చి మనకు అయుధం చూపించి మానభంగాలు సామాన్యంగా మారి పోతాయి. సామన్య మానవ జీవితం ధుర్భరం అయిపోయి నేరాలు మానవ జీవితం లొ న్రిత్య కృత్యం అయిపోయి నేరాలు చేయని వాడిని బలహీనుడిగా, అయోగ్యుడిగా జమకడతారు.

ఈ అవినీతి అధర్మం పేరుకోని కేన్సర్ లా మన సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. కేన్సర్ కి మందు వెన్న పూత కాదు కేన్సర్ కి కెమో థెరపి జరిగి తీరాలి. కెమోథెరపి జరిగితే జుత్తు ఊడి పోతుంది, శరీరం బలహీనమైపోతుంది, త్వరగా అలిసిపోతారు అందువల్ల కెమోథెరపి చెయ్యద్దు అనే కేన్సర్ మూలకణాల మాటలు లక్ష్య పెట్టకుండా చికిత్స జరిపించాలి.

గత పది రొజులగా మనం చూస్తున్నాం, చిన్నా పెద్ద అవినీతి చేసి సంపాదించనవాళ్ళందరు బాధ పడుతున్నారు. దాని వలన కొంతమంది మనలాంటి సామన్య ప్రజలకి కొంత అవస్త తప్పలేదు. అయినా దీనిని మనం చికిత్సలో భాగంగా గమనించాలి. అయినా ఇది కెమో థెరపి లో మొదటి డోస్ మాత్రమే.

ధర్మసంస్తాపన జరగాలి అంటే భగవద్గీత ఉపదేసిస్తే చాలదు. గీతోపదేశం అర్జునిడికే జరగింది ధుర్యోధనుడికి మిగిలింది నికృష్ఠమైన చావే. అవినీతి అధర్మ పరులకి మిగిలేది ………………………

కాముధ – కాకర మురళీధర్

భగవద్గీత – 1

July 2, 2016

భగవద్గీత అర్ధం కావలంటే అర్జున విషాదయోగం తో అనుసంధానం కావాలి. యుధ్ధప్రారంభానికి ముందు అర్జునుని మనఃస్తితి అర్ధంకాకపోతే భగవద్గీత కేవలం శుశ్కవాదం గాను, నిష్క్రియాపరత్వాన్ని భొదించేది గాను, వ్యక్తి పూజను ప్రొత్సహించేది గాను కనబడుతుంది.
అర్జునుని నిర్వేద సముధ్దతి తెలియకపోతే, కర్మ యోగం అసమంజసం గాను, ఙ్ఞానవిఙ్ఞాన యోగం స్వయంస్తుతి గాను, విభూతియోగం మతిస్తిమితంలేని ప్రేలాపనగాను అనిపిస్తుంది.
అర్జునిని విషాదం చాలా మందికి ఎందుకి అర్ధం కాదు, కారణం చాలా చిన్నది. సీతారామ శాస్త్రి గారు చెప్పినట్లు “మనం… ఈదుతున్నాం చెంచాడు భవ సాగరాలు”. మనం మన కస్టాలు చాలా చిన్నవి, వాటిని అర్జునవిషాదంతో ఐడింటిఫై చెయ్యలేం. జీతం పెరుగుదల, అదికారి వ్యాత్సల్యం, పదోన్నతి, అరోగ్యం, ఆస్తి వీటి క్షీణతే మనకు అనిశాపాతం. మన మాట నెగ్గకపోవటమే, మనకు అత్యంత ధుర్భరం. వీటినిమించి మనకు పెద్దగా కస్టాలు లేవు. వీటిని అధికమించడానికి మనకు భగవద్గీత లాంటి అధ్యాత్మికత, విశ్వరహస్యాలు మేళవించిన మనో వైఙ్ఞానిక గ్రంధం అవసరం లేదు. వ్యక్తిత్వవికాశ గ్రంధాలో మొట్టమొదటిది అత్యుత్తమమైనది అయిన భగవద్గీత అందుకే నవీన నిత్య జీవనంలో కేవలం వృద్ధుల పారయణ గ్రంధంగా మిగిలిపోయింది.
అర్జనుడు యుధ్ధం ఎందుకు వద్దన్నాడు. అతనికి యుధ్ధం అంటే ఏకోశాన భయం లేదు. అతను జయత్ర యాత్ర చేసి అనేక దేశ దేశాలను స్వయంగా జయించాడు. నేర్చుకున్న అస్త్ర శస్త్రాలను యుధ్ధ తంత్రాలను నియొగించి అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. అర్జుననుని మించిన వీరుడు అక్కడ కురుక్షేత్రం లో మరోకరు లేరు. అయినా ఎందుకు వద్దన్నాడు.
అర్జున విషాద యోగం గూర్చి తరువాతి టపాలో
కాముధ – కాకర మురళీధర్

నేను భగవద్గీత.

June 21, 2016

నేను 17 యేళ్ళ వయసు లొ మొదటి సారి భగవద్గీత చదివినప్పుడు అందులో వున్న వ్యాకరణ విశేషాలకి ముగ్ధుడనయ్యాను. ఆ శబ్ధాలంకారాలకి, వివిధమైన అర్ధాలంకారలకి వివశుడనయ్యాను. ఆ శ్లోకాల నడకకి పదాల పోహళింపుకి పరవశుడినయ్యాను. కృష్ణుడు అర్జనుడి సంభోదించడానికి వాడిన దరిదాపు 45 వివిధమైన పదాల వైవిధ్యానికి ఆశ్చర్య పోయాను.

30 యేళ్ళ వయసులో రెండవ సారి చదివినప్పుడు ఆత్మ సంయనయోగం తొ వైఫల్యాల విచారం నుండి విముక్తుడనై, కర్మ యోగం తొ కార్యోన్ముఖుడనయ్యను.

35 యెళ్ళ వయసులో మరో సారి చదివినప్పుడు అక్షర బ్రహ్మ యోగంలొ ఉన్న ఖగొళ శాస్త్ర విషయాలకి, సమయానికి స్తలానికి ఉన్న సంబంధం గురించిన వివరణ, వ్యక్తానికి అవ్యక్తానికి ఉన్న వివరణకి ఐనస్టీన్ థియరి ఆఫ్ కర్వేచర్ ఉన్న పోలికలను చూసి విస్తుపొయాను.

40 యేళ్ళ వయసులో మరో సారి సాంఖ్య యోగం చదివినప్పుడు వివరించిన నాయకత్వ లక్షణాలు వివరణ ఇన్నిసార్లు చదివినపుడు ఎలా నాకు స్పురించలేదో ఇప్పుడు మాత్రమే ఎందుకు అర్ధం అవుతునాదో అర్ధం కాలెదు.

42 యేళ్ళ వయసులో మరో సారి చదివినప్పుడు కర్మ సన్యాస యోగం అంటే కర్మ యోగానికి వ్యతిరేకం కాదని. It is the difference between doing the things and getting the things done అని అర్ధం అయ్యి నా ఉద్యొగ నిర్వాహణా దక్షతని మరో ఎత్తుకి తీసుకు వెళ్ళింది.

తరువాత మరో సారి చదువుతున్నపుడు రాజవిద్యా రాజగుహ్య యోగానికి, విభూతి యోగానికి ఉన్న స్వల్పమైన వ్యత్యాసం అర్ధమైనప్పుడు పరమానంద భరితుడినయ్యాను.

ఇలా చదువుతున్న ప్రతీసారి ఒక కొత్త కొణం కనిపించి సరికొత్త పుస్తకం మొదటి సారిగా చదువుతున్న అనుభూతిని ఇచ్చేది ఒక్క భగవద్గీత మాత్రమే.
కాముధ ఉరఫ్ కాకర మురళీధర్

బాహుబలి అఖండ విజయానికి కారణాలు.

July 30, 2015

ఈ మధ్య తెలుగు వెబ్ మీడియా లో బాహుబలి బాగులేదన్నవాడు మేధావి గాను, బాగుందన్నవాడు ఉత్తమాభి రుచి లేని వాడుగాను పరిగిణిస్తున్నారు. బాగులేదన్నవారు కూడా ఎందుకు బాగులేదంటే, ఇది గుణసుందరి సుగుణసుందరి కథలలా లేదు, మాయాబజార్ మంగమ్మశపధం లా లేదన్నవాడేతప్ప ఎందుకు బాగాలేదో సమగ్రంగా విశ్లేషించిన వారు లేరు.

ఈ సినిమా అఖండ విజయనికి కారణాలుగా, మార్కెటింగ్, కులాభిమానం, ఇంకా వేరే రాజకీయాల్ని సాకులుగా చూపిస్తున్నారు.

ఒకవిషయం మాత్రం మరిచిపోయెరు. సినిమా విజయానికారణం ప్రేక్షకుల ఆదరణ. ఈ సినిమాప్రేక్షకులకు ఎందుకు నచ్చిందో ఒక్కడు కూడా రాయలేదు. నచ్చిందన్న ప్రతివాడిని ఒక వెర్రి వెధవని చూసినట్లు చూస్తున్నారు.

బాహుబలి అఖండ విజయానికి కారణాలు.

1) తమకు తెలిసిన పరిచియమైన కథ దానికి తగ్గ విభిన్నమైన కథనం.

2) మొదట్లోనే అద్భుతమైన హీరో ఎలివేషన్.

3) సీన్‌కి సీన్‌కి లింకింగ్.

4) కంటిన్యుగా ఎమోషన్స్ కేరి అవ్వడం.

5) యుధ్ధం సంఘటన. అక్కడ కెమేరా ముందే మాత్రమే యుధ్ధం జరుగుతునట్లు ఎవరికి అనుమానం రాలేదు. ఒక క్రికెట్ మాచ్ లైవ్ టెలికాస్ట్ జరుగుంటే చూసినట్లు, అక్కడ ఒక యుధ్ధం లైవ్ టెలికాస్ట్ చేసినట్లు చూపించారు.

6) విగ్రహస్తాపన సమయంలో బాహుబలి జయజయ ధ్వానాలు.

ఇంకా మరెన్నో….

ఈ విమర్శకులందరికి తెలిసిన మరోక విషయం. Reason stops the moment Drama starts. రాజమౌళి Drama ఎక్కడమొదలు పెట్టెడో అక్కడ ఖచ్చితంగా ప్రేక్షకులు ఫీల్ అయ్యేరు. విమర్శకులు ఫీల్ అవలేదు. Sometimes Ignorance is Bliss.

నాకు తెలుసు

November 19, 2014

నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు.
పెరిగిన ఖర్ఛులకి పెరగని జీతానికి పొంతన కుదరనప్పుడు
ఎక్కడ ముడి వేయాలి, ఎక్కడ కత్తిరించాలి
అదాయ వ్యయాలని ఎలా సమన్వయం చేయాలి
జీవన ప్రమాణాలు దిగజారకుండా ఎలా చెయ్యాలో
నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు.

పదాలకున్న అర్ధాలు అపార్ధాలైనప్పుడు
మానవ సంబంధాలు మృగ్యమైనప్పుడు
ఎవరిని ఎలా బుజ్జగించాలో, ఎవరిని లాలించాలో
జీవిత పధాన్ని ఎలా అనందమయం చెసుకోవాలో
నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు.

ఉద్యొగ నిర్వాహణ క్రమం లో తప్పులు చేసినప్పుడు.
పొంచి ఉన్న రాబందులు రెక్కలు విప్పి వీర విహంగం చేసినప్పుడు
ఎత్తుకి పై‌ఎత్తు ఎలా వెయాలో ఎవరిని ఎలా సమాధాన పరచాలో
జీవిత రధాన్ని సాఫీగా ఎలా ముందుకు సాగించాలొ
నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు.

నాకు తెలిసినది, నేను తెలుసుకున్నది, నాకు తెలియనిది
నాకు తెలుసుని నాకు తెలిసినది
నాకు తెలియదని నాకు తెలిసినది
ఇదంతా నిజంగా నాకు తెలియదని
శ్రీమహా విష్ణు సామ్రాజ్యంలో నా ప్రవర్తన కేవలం కల్పితమని
నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు.